NETI SUBHODAYA
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 1:31 pm Posted by : NETI SHUBHODAYA NEWS

తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య భారీగా పెరుగుదల . ఎస్‌ఆర్‌ఎస్ నివేదికలో కీలక విషయాలు

హైదరాబాద్, నేటి శుభోదయ :
తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ స్పష్టం చేసింది. విడాకులు, భాగస్వామిని కోల్పోవడం, వివాహం కాకుండా ఒంటరిగా జీవించడం వంటి కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక సంఖ్యలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు పురుషుల కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే దాదాపు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో ప్రస్తావించారు.
సామాజిక నిపుణుల అభిప్రాయం ప్రకారం:- కుటుంబ విభేదాలు, విడాకుల పెరుగుదల, భర్తల మరణాలు, ఉపాధి కోసం వలసలు, ఆర్థిక పరిస్థితులు, మహిళల్లో స్వయం ఆధారిత జీవనశైలి పెరగడం వంటి అంశాలు ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భాగస్వామిని కోల్పోయిన మహిళలు అధికంగా ఒంటరి జీవితాన్ని గడుపుతుండగా, పట్టణ ప్రాంతాల్లో విడాకుల కేసుల పెరుగుదల ప్రభావం కూడా కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, యువశక్తి అధికంగా ఉన్న దేశంగా పేరున్న భారత్‌ నెమ్మదిగా వృద్ధాప్య సమాజం వైపు అడుగులు వేస్తోందని ఈ నివేదిక సంకేతాలు ఇస్తోంది. జననాల రేటు క్రమంగా తగ్గడం, వృద్ధాప్య మరణాల పెరుగుదల, జీవితకాలం పెరగడం వంటి అంశాలు దేశ జనాభా నిర్మాణంలో కీలక మార్పులకు దారితీస్తున్నాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు 70 శాతానికి పైగా శ్రామిక జనాభాతో ముందంజలో ఉన్నప్పటికీ, రానున్న కాలంలో వృద్ధుల సంఖ్య పెరగడం, కుటుంబ వ్యవస్థల్లో మార్పులు చోటుచేసుకోవడం, ఒంటరి మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలు ప్రభుత్వాలకు సవాల్‌గా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల సామాజిక భద్రత, మానసిక ఆరోగ్యం, ఆర్థిక పరమైన రక్షణ, వృద్ధాప్య సంరక్షణపై ప్రత్యేక విధానాలు అవసరమని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.