NETI SUBHODAYA
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 1:35 pm Posted by : NETI SHUBHODAYA NEWS

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి-కర్నాకుల డిమాండ్

 

కాకినాడ జిల్లా, జగ్గంపేట జూన్ 07 నేటి శుభోదయ: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పేద- మధ్యతరగతి కుటుంబాలు బాధపడుతున్న వేళ మరల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని కర్నాకుల విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పరిది రంగవల్లి నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ మూడు నెలలు వ్యవధిలోనే వంట గ్యాస్ ధరలు దప దపాలుగ పెంచుతూ నేడు మరల 29 రుపాయలు పెరగడం, చమురు సంస్థలు లాభాలు వచ్చినప్పుడు ఏమాత్రం తగ్గించకుండా ఇప్పుడు నష్టాలు వచ్చేయంటూ పేద మధ్య తరగతి వినియోగదారుల మీద భారాన్ని మోపడం సరైన పద్ధతి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అటు రైతులకు ఎరువుల ధరలు పెంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్నారని, ఇటు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని, అటు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. మరోసారి వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల బ్రతులు మరింత సంక్షోభంలో నెట్టారని ఆయన కేంద్రం ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్,పెట్టోల్,డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.దేశం రోజు రోజుకి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు-కూలీ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రమేష్,సంఘ నాయకులు కె రామలింగేశ్వర రావు, రంగవల్లి నగర్ నాయకులు డాన్ శ్రీను, కొండేపూడి మంగయమ్మ, తదితరులు పాల్గొన్నారు.