NETI SUBHODAYA
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 1:16 pm Posted by : NETI SHUBHODAYA NEWS

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి నాణ్యతే విజయానికి కీలకం : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి

 

 

ప్రజల్లో నిరంతరం ఉంటేనే గెలుపు సాధ్యం,:

 

— ఇగోలకు తావు లేకుండా సమిష్టి లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపు

 

— సర్ ప్రక్రియపై అప్రమత్తత అవసరం

 

— ఓట్ల చేర్పులు, తొలగింపుల విషయంలో శ్రేణులు జాగ్రత్తగా వ్యవహరించాలి

 

— క్లస్టర్ స్థాయిలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు ప్రతిపాదన

 

— యువత, బీఎల్‌వోలు, అనుభవజ్ఞులతో సమన్వయానికి సూచనలు

 

— ఓటర్ల సౌకర్యాలే ప్రాధాన్యం

 

— బూత్‌ల ఏర్పాటు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే చంద్రావతి

ఖమ్మం, వైరా, నేటి శుభోదయ :::

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలమే కాకుండా పోటీ చేసే అభ్యర్థి వ్యక్తిత్వం, ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ కూడా విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలని వైరా అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి పేర్కొన్నారు. ఆమె ” నేటి శుభోదయ” ప్రతినిధి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీలో ఉండటం ఖాయమని చెప్పకనే చెప్పారు. ఇప్పటికే ఆమె రెండు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ఆమె ముందస్తుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజలతో నిరంతర అనుబంధం కొనసాగించే నాయకులకే ఎన్నికల్లో విజయం దక్కుతుందని, ప్రజలకు దూరమైతే ఓటమి తప్పదనే విషయాన్ని గత ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయని ఆమె అన్నారు.

ఖమ్మం, వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇన్‌ఛార్జులు, కో-ఇన్‌ఛార్జులు, డివిజన్ ఇన్‌ఛార్జులకు సర్ ప్రక్రియ పై టెలికాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం నగరంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

అభ్యర్థిత్వం ఆశించే నాయకులు ప్రజల మధ్య నిరంతరం ఉండాలని, వ్యక్తిగత విభేదాలు, ఇగో భావనలకు చోటు ఇవ్వకుండా సమిష్టి ప్రయోజనాల కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లేలా ఎవరూ వ్యవహరించవద్దని హెచ్చరించారు. అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలే ప్రజాదరణకు, విజయానికి మూలమని పేర్కొన్నారు.

సర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీఎల్‌వోలు, యువత, పార్టీ అనుభవజ్ఞులతో సమన్వయం పెంచుకుంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు అంశాలపై శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

అలాగే పోలింగ్ బూత్‌ల ఏర్పాటు విషయంలో ఓటర్ల సౌకర్యాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని పార్టీ శ్రేణులు అభిప్రాయాలు తెలియజేస్తే, వాటిని ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తానని చంద్రావతి హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలువురు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన అధిష్టానం పరిశీలనలో తాను ముందు వరుసలో ఉన్నట్లు ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికే బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ లను పలు దఫాలుగా కలిసిన సందర్భంలో వారు ఈ దఫా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలి అని, అందుకు కసరత్తును ఇప్పటి నుంచే వ్యూహం ప్రకారం క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చంద్రావతి కి రెండు నియోజకవర్గాల్లో ఆమెకు ఆదరణ పుష్కలంగా ఉంది. గత ఎన్నికల్లో ఖమ్మం, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ఇరువురు ఓటమి చెందటం వల్ల ఆమెకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలువురు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన అధిష్టానం పరిశీలనలో చంద్రావతి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం మరోసారి పునర పరిశీలన చేసి ఆమెకు అవకాశం కల్పిస్తే తప్పక విజయం సాధించడం ఖాయమని చెప్పకతప్పదు.